పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0330-01 దేవక్రియసం: 04-172 కృష్ణ


పల్లవి :

విచ్చనవిడినీ యాడీ వీఁడె కృష్ణుఁడు
వొచ్చములేనివాఁడు వుద్దగిరికృష్ణుఁడు


చ. 1:

గల్లుగల్లుమనఁగాను గజ్జలు నందెలతోడ
బిల్లఁగోట్లాడీని పిన్నకృష్ణుఁడు
కెల్లురేఁగి వీధులనుఁ గేరి పుట్టచెండులాడీ
బల్లిదుఁడు గదవమ్మ బాలకృష్ణుఁడు


చ. 2:

తమితోడ గోపాలులు తానుఁ గూడి ముంగిటను
సముద్రబిల్లలాడీ సాధుకృష్ణుఁడు
చెమటలుగార సిరసింగనవత్తి యాడీ
గుమితాన వీఁడే యమ్మా గోపాలకృష్ణుఁడు


చ. 3:

వుదుటునఁ బారి పారి వుడ్డగచ్చకాయలాడీ
ముదముదొలఁకఁగాను ముద్దుకృష్ణుఁడు
అదివో శ్రీవేంకటేశుఁ డాటలెల్లాఁ దానే యాడీ
పదివేలు చందాల శ్రీపతియైన కృష్ణుఁడు