పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0330-06 హిందోళ వసంతం సం: 04-177 వేంకటగానం


పల్లవి :

ఎన్నిమహిమలవాఁడె యీదేవుఁడు
కన్నులపండువులెల్లాఁ గదిసినట్టుండెను


చ. 1:

పోలింప కర్పూరకాపు పురుషోత్తమునికి
యేలీల నుండెనని యెంచి చూచితే
పాలజలనిధిలోనఁ బవళింపగా మేన
మేలిమిమీఁగఁంటిన మెలుపుతో నుండెను


చ. 2:

తట్టుపునుఁగు కాపు దైవశిఖామణికి
యెట్టుండెనని మరి నెంచి చూచితే
చిట్టకాన రేపల్లెలో చీఁకటితప్పు సేయఁగా
అట్టె రాత్రులు మేననంటి నట్టుండెను


చ. 3:

అలమేలుమంగతోడ నట్టె సొమ్ము ధరించఁగ
యెలమి శ్రీవేంకటేశునెంచి చూచితే
కలిమిగలయీకాంతకాఁగిటఁ బెనఁగఁగాను
నిలువెల్లా సిరులై నిండినట్టుండెను