పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0328-01 రామక్రియ సం: 04-160 కృష్ణ


పల్లవి :

అడర శ్రావణబహుళాష్టమి నేఁ డితఁడు
నడురేయి జనియించినాఁడు చూడఁగదరే


చ. 1:

గొంతిదేవిమేనల్లుఁడు గోపసతులమగఁడు
పంతపుపాండవులకు బావమరఁది
వంతుతో వసుదేవదేవకులకుమారుఁడు
ఇంతటికృష్ణుఁడు జనియించినాఁడుగదరే


చ. 2:

బలరామునితమ్ముఁడు పంచసాయకునితండ్రి
మలసి మేటైనయభిమన్యునిమామ
లలి సాత్యకిసుభద్రలకుఁ దోఁబుట్టినయన్న
ఇలపైఁ గృష్ణుఁడు జనియించినాఁడుగదరే


చ. 3:

సూరసేనుమనుమఁ డచ్చుగ ననిరుద్ధు తాత
పౌరవయాదవలోకబాంధవుఁడు
ఆరయ శ్రీవేంకటేశుఁ డలమేల్మంగకుఁ బతి
యీరీతిఁ గృష్ణుఁడు జనియించినాఁడుగదరే