పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0327-06 బౌళి సం: 04-159 రామ


పల్లవి :

ఇతఁడు తారకబ్రహ్మ మీతఁడు సర్వేశ్వరుడు
రతికెక్కఁ గొలిచిన రక్షించు నితఁడు


చ. 1:

తరణివంశజుడై తాటకను హరియించి
అరుదుగ విశ్వామిత్రుయాగము గాచి
హరునివిల్లు విరిచి యట్టె సీతఁ బెండ్లియాడి
పరశురాముని నిజబలిమి చేకొనెను


చ. 2:

మునులకభయమిచ్చి మొగి నసురలఁ ద్రుంచి
ఘనమైన మాయామృగముఁ జంపి
కినిసి వాలిఁ గొట్టి సుగ్రీవునిఁ బట్టముగట్టి
వనధి బంధించి లంక వడిఁ జుట్టుముట్టెను


చ. 3:

బలు రావణునిఁ జంపి పుష్పకముపైఁ దాఁ జేకొని
లలి విభీషణునకు లంక ఇచ్చి
చెలఁగి యయోధ్య యేలి శ్రీవేంకటాద్రిమీఁద
వెలయ రాముఁడు దానై విశ్వమెల్లా నేలెను