పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0328-02 లలిత సం:04-161 కృష్ణ


పల్లవి :

చూడవమ్మ కృష్ణుఁడు నీ సుతుఁడోయమ్మ
ఆడీ వీధుల వెంట యశోదమ్మా


చ. 1:

కోలలు చాఁచీ వుట్లు గొట్టఁగా బాలుఁ బెరుగు
కాలువలు గట్టి పారేఁ గదవమ్మా
మేలములాడీ వద్దంటే మిక్కిలి గొల్లెతలతో
ఆలకించి వినవమ్మ యశోదమ్మా


చ. 2:

చక్కిలాల కుండలెల్లా చలాన దొండ్లు వొడిచి
దిక్కన దోఁటికోలలఁ దీసీనమ్మా
చిక్కని తేనె చాడె చివ్వన రాత వేసితే
అక్కడ జోరునఁ గారె యశోదమ్మా


చ. 3:

అల్లంత నుండి తన కందరాని తెంకాయలు
వల్లె తాళ్ళు వేసి వంచీనమ్మా
బల్లిదుఁడలమేల్మంగపతి శ్రీవేంకటేశుఁడు
అల్లిబిల్లై యున్నాఁడమ్మ యశోదమ్మా