పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0326-05 వరాళి సం: 04-152 వేంకటగానం


పల్లవి :

మఱి తను భోగములు మాయా విలాసములు
యెఱిఁగి నట్లనుండు మఱపించుఁ దలఁపు


చ. 1:

అనిశము నీకొలువు అది యొకటే నిజము
నినుఁదలఁచుటొకటే నిజము
పనివడి నీదాసుఁడై బ్రదుకుటొకటే నిజ-
మొనర నిన్ను నుతించేదొక్కటే నిజము


చ. 2:

పరగ నీమీదఁజేయు భక్తియే నిలిచినది
నిరతపువైరాగ్యమే నిలిచినది
శరణని నీకుమొక్కే జ్ఞానమే నిలిచినది
అరసి నిన్నుఁబూజించినదే నిలిచినది


చ. 3:

చదివి నిన్ను వెదకి సాధించుటే ఫలము
అదన నీకృపాపాత్రుఁడౌటే ఫలము
యెదుట నలమేల్మంగనేలిన శ్రీవేంకటేశ
యెదలోన నీధ్యాన మిన్నిటికి ఫలము