పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0326-06 సామంతం సం: 04-153 వేంకటగానం


పల్లవి :

ఏది మాకు గతియిక నీశ్వరేశ్వరా
యీదెస మము గరుణ నీడేర్చవయ్యా


చ. 1:

పొంచిమున్ను భోగించిన భోగములు దలఁచి
అంచెల నాలుబిడ్డల నటు దలఁచి
కంచపుటాహరములు కన్నవెల్లాను దలఁచి
యెంచి నిన్నుఁ దలఁచక యిట్లున్నారమయ్యా


చ. 2:

కన్నులఁజూచినందెల్లా కడునాసలఁ దగిలి
విన్న వినుకులకెల్లా వేడ్కఁదగిలి
పన్నిన సుఖములకుఁ బైకొని వెనుతగిలి
వున్నతి నిన్నుఁ దగులుకున్నారమయ్యా


చ. 3:

చెంది గృహారామ క్షేత్రములు మరిగి
పొందగు సంసారమిప్పుడు మరిగి
అందపు శ్రీ వేంకటేశ అలమేల్మంగపతివి
కందువ మరిగీ మరుగకున్నారమయ్యా