పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0326-04 ధన్నాసి సం: 04-151 వేంకటగానం


పల్లవి :

దేవుదేవుఁ డితడే దివ్యమూరితి
యేవలఁ జూచినఁ దానే యీరూపై వున్నాఁడు


చ. 1:

వేంకటాచలము మీఁది విశ్వరూప విశేషము
అంకెల ననంతావతారాలైన విశేషము
లంకె సింగారాది సర్వాలంకార విశేషము
యింకనిమహిమలతో నీరూపై వున్నాఁడు


చ. 2:

అందరిలో నంతర్యామియైన విశేషము
కందర్పుఁబుట్టించిన ఘన విశేషము
ముందు జగముసృష్టించి మూలమైన విశేషము
యిందరితోఁ గూడుకొని యీరూపై వున్నాఁడు


చ. 3:

పరము యోగీంద్రులెల్ల భావించిన విశేషము
అరుదైన వేదవేదాంతార్థ విశేషము
పరగ నలమేల్మంగపతియై శ్రీవేంకటేశుఁ-
ఊరవై దాసులఁ గావ నీరూపై వున్నాఁడు