పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0326-03 దేశాక్షి సం: 04-150 గురు వందన, నృసింహ


పల్లవి :

ఇందుకేది వుపాయ మోయీశ్వర నీకే తెలుసు
మందలించ నశక్తుఁడ మరి నీదాసుఁడను


చ. 1:

ధీరుఁడనై ధరలోన దేహము నే మోచితి
కోరి పుణ్యపాపాలకు గురియు నైతి
వూరట యేమిటా లేదు వోపనని మానరాదు
తీరదు భోగించక దినదినకర్మము


చ. 2:

గరిమ సంసారినైతి కంటిఁ బెక్కుసుతులను
యిరవుగఁ గట్టుకొంటి నీలంపటాలు
వెర వేమీ నెరఁగను విడువ వెంతైనాను
హరిహరి రాచినా సమయపు బలుకాంక్షలు


చ. 3:

అట్టె గురుముఖమైతి నాతుమలో నినుఁ గంటి
జట్టిగొని నీపాదాలే శరణంటిని
గట్టిగా నలమేల్మంగకాంతుఁడ శ్రీవేంకటేశ
యిట్టె నిన్నెరఁగలేని దిన్నాళ్ళు నానేరమి