పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0326-02 లలిత సం: 04-149 విష్ణు కీర్తనం


పల్లవి :

విష్ణుదేవు పాదములే విద్యాబుద్దీ మాకు
వైష్ణవులమైతి మింక వదలవో కర్మమా


చ. 1:

గోవిందుని పాదములే కోరి యిహపరములు
శ్రీవిభుని పాదములే చేరు వేదశాస్త్రములు
దేవదేవు పాదములే దిక్కును దెసయు మాకు
భావములో నిలిపితిఁ బాయరో పాపములు


చ. 2:

హరి పాదములే మాకు నన్నపాన భోగములు
పరమాత్ము పాదములే పాఁడీ బంటా మాకు
మురహరు పాదములే ముందరవెనకా మాకు
శరణంటి మెందైనాఁ జనరో దుఃఖములు


చ. 3:

అనంతుని పాదములే ఆయుష్య భాష్యములు
దనుజారి పాదములే ధనధాన్య ధర్మములు
యెనలేని శ్రీవేంకటేశుడితని పాదాలే
మనసున గొలిచితి మానరో భవములు