పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0326-01 గుండక్రియ సం: 04-148 మాయ


పల్లవి :

కైకొంటే కాక కమలనాభునియాజ్ఞ
పైకొని ఇన్నిటాను బాసివుండ ఇనేది


చ. 1:

హరినిర్మితములే అఖిలప్రపంచము
తొరలి యేమిటి నిందు దూషించేది.
ధరణిధరునికి దాసులే జీవులెల్లా
గరిమ నెవ్వరి నిందుఁ గాదనేది


చ. 2:

వాసుదేవు కల్పితమే వరసంసార బంధము
దోసమంటా యెందెందు దొలఁగేది
శ్రీసతీశు రచనలే చేకొన్న రుచులెల్ల
యీసుతోడ నిందుమీఁద నెట్టురోసేది


చ. 3:

గోవిందుమాయలే కూడినట్టి పనులెల్ల
వేవేలై యిందునెట్టు వేసరేది
శ్రీవేంకటేశుఁడే చిత్తములో ధ్యానమెల్లా
పావనమైతిమి యిఁక బరచింత యేది