పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0325-06 శ్రీరాగం సం: 04-147 రామ


పల్లవి :

రామచంద్రుఁ డితఁడు రఘు వీరుఁడు
కామిత ఫలము లియ్యఁ గలెగె నిందరికి


చ. 1:

గౌతము భార్య పాలిటి కామధేనువు వితఁడు
ఘాతలఁ గౌశీకు పాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణీతఁడు
యీతఁడు దాసుల పాలి యిహ పర దైవము


చ. 2:

పరగ సుగ్రీవు పాలి పరమ బంధుఁడీతఁడు
సరి హనుమంతు పాలి సామ్రాజ్యము
నిరతి విభీషణుని పాలి నిధానము
గరిమ జనకు పాలి ఘన పారిజతము


చ. 3:

తలఁప శబరి పాలి తత్వపు రహస్యము
అలరి గుహుని పాలి ఆదిమూలము
కలఁడన్నవారి పాలి కన్ను లెదుటి మూరితి
వెలయ శ్రీ వేంకటేద్రి విభుఁడీతడు