పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0325-05 పాడి సం: 04-146 నృసింహ


పల్లవి :

సుగ్రీవ నారసింహుని జూడరో వాఁడె
అగ్రపూజ గొన్నవాఁడు ఆది సింహము


చ. 1:

దేవతలు జయపెట్టి దివినుండి పొగడఁగ
దేవులతోఁ గూడున్నాఁడు దివ్య సింహము
భావింప నెట్టనెదుట ప్రహ్లాదుఁడుండఁగాను
వేవేలు నవ్వులు నవ్వీ విజయ సింహము


చ. 2:

అసురలను గెలిచి అదె సింహాసనముపై
వెసఁగొలువున్నాడు వీర సింహము
పసిడివర్ణముతోడ బహుదివ్యాయుధాలతో
దెసల వెలుగొందీని ధీర సింహము


చ. 3:

నానాభరణాలు వెట్టి నమ్మినదాసులనెల్ల
ఆనుకొని రక్షించీఁ బ్రత్యక్ష సింహము
పూని శ్రీవేంకటాద్రిని బుధులెల్లాఁ గొలువఁగా
నానావరము లొసఁగీ మానవ సింహము