పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0325-04 సాళంగనాట సం: 04-145 హనుమ


పల్లవి :

హరికి లంకిణీహంత కంతర మిట్టున్నది
కరుణ నింత మన్నించె కమలావిభుఁడు


చ. 1:

విశ్వరూపు చూపినాడు విష్ణుఁడు దొల్లి యట్టె
విశ్వరూపాంజనేయుఁడు వీఁడె చూపెను
శాశ్వతుఁడై యున్నవాఁడు సర్వేశ్వరుఁడు వీఁడే
శాశ్వతుఁడై యున్నవాఁడు జగములో నీతఁడు


చ. 2:

ప్రాణవాయుసంబంధి పరమాత్మఁడు అట్టె
ప్రాణవాయుసుతుఁడు పవనజుఁడు
రాణింప రవివంశుఁడు రామచంద్రుడు తాను
నాణెపు రవిసుతుని నమ్మిన ప్రధాని


చ. 3:

దేవహితార్థముసేసఁ ద్రివిక్రముఁడు అట్టె
దేవహితార్ధమే జలధిలంఘనుఁడు
శ్రీవేంకటేశుఁడు చిన్మయమూర్తి తాను
కోవిదుఁడు జ్ఞానమూర్తి గొప్పహనుమంతుఁడు