పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0325-01 వరాళి సం: 04-142 శరణాగతి


పల్లవి :

ఎవ్వరివాఁడాఁగాను యేమందు నిందుకు
నవ్వుచు నాలోని హరి నన్నుఁ గావవే


చ. 1:

కోపులరాజులనెల్ల కొలిచి కొన్నాళ్ళు మేను
చూపుడుఁబూఁట వెట్టితి సొగసి నేను
యేపున సంసారమున ఇదిగాక కమ్మటాను
దాపుగ తొర్లుఁబూఁట తగిలించుకొంటిని


చ. 2:

మొదలఁ గర్మములకు మోసపోయి యీ బ్రదుకు
కుదువపెట్టితి నే గురి గానక
వెదకి కామునికి విషయములకు నే
అదివో నావయసెల్ల నాహివెట్టితిని


చ. 3:

ఇప్పుడే శ్రీవేంకటేశ యీడేర్చి నామనసు
కప్పిన గురుఁడు నీకు క్రయమిచ్చెను
వొప్పించి అందరు బలువుఁడు చేపట్టెననుచు
అప్పులెల్లఁబాసి నీసొమ్మైతినేనయ్యా