పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు:0324-06 శంకరాభరణం సం: 04-141 హనుమ


పల్లవి :

ఆతడాఁ యీతఁడు పెద్దహనుమంతుఁడు
చేతులారా నక్షునిఁ జెండివేసినాఁడట


చ. 1:

తొలుత రాముని గాంచి తోడనే సుగ్రీవుని
కొలువఁ బెట్టి యాతనికొమ్మ నిప్పించి
జలనిధి దాఁటి లంక సాధించి చొచ్చి సీతకు -
నలర నుంగర మిచ్చె నతిసాహసమున


చ. 2:

సీతాదేవి యానవాలు శ్రీరామునికి నిచ్చి
నీతి విభీషణుని మన్నించఁజేసి
చేతులనే పోట్లాడి చెండివేసి రాక్షసుల
ఘాతల సంజీవికొండ గక్కనఁ దాఁ దెచ్చెను


చ. 3:

గక్కన రావణుఁ గొట్టి కాంతను రాముని గూర్చి
అక్కడ నయోధ్యఁ బట్ట మటుగట్టి
నిక్కి కలశాపురిని నిండి శ్రీవేంకటాద్రిని
వుక్కమీరి హరిఁగొల్చి వున్నాఁడు వేడుకల