పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0323-02 బౌళి సం: 04-131 మాయ


పల్లవి :

పుట్టెడి దింతా బూటకంబులే
గట్టిమాయ హరిఁ గానఁగ నీదు


చ. 1:

ముక్కున నున్నది ముందటఁ బ్రాణము
యెక్కడ నమ్మేదిఁకఁ దనువు
చుక్కలు మోఁచీ జూపులెదుటనే
నెక్కొను మతికిని నిలుకడ యేది


చ. 2:

నాలుక నున్నవి నానారుచులును
వేళావేళకు వెరవేది
తోలున నున్నది దొరకొని బ్రతుకిది
కాలంబెటువలెఁ గడపేది


చ. 3:

ఆతుమనున్నది యఖిలజ్ఞానము
ఘూతల నెటువలెఁ గనియేది
శ్రీతరుణీపతి శ్రీవేంకటపతి
యాతనిఁగొలిచితి మడ్డంబేది