పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు:0323-03 సాళంగనాట సం: 04-132 వైష్ణవ భక్తి


పల్లవి :

ఉమ్మడికర్మములాల వుండఁ జోటు మీకు లేదు
యిమ్ముల నెందైనాఁ బోరో యివి లేనిచోటికి


చ. 1:

పెట్టినది నుదుటను పెరుమాళ్ళ లాంఛనము
దట్టమై భుజములందు దైవశిఖామణిముద్ర
నెట్టన నాలుకమీఁద నీలవర్ణునామమిదె
అట్టే హరిదాసులకంటునా పాపములు


చ. 2:

మనసునఁ దలచేది మాధవుని పాదములు
దినముఁ గడుపునించేది హరిప్రసాదము
తనువుపైఁ దులసిపద్మాక్షమాలికలు
చెనకి హరిదాసులఁ జేరునా బంధములు


చ. 3:

సంతతముఁ జేసేది సదాచార్యసేవ
అంతరంగమున శరణాగతులసంగమిదే
యింతటాను శ్రీవేంకటేశుఁడు మమ్మేలినాఁడు
అంతటా హరిదాసుల నందునా అజ్ఞానము