పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0323-01 భూపాళం సం: 04-130 మేలుకొలుపులు


పల్లవి :

రాతిరెల్ల సతులతో రతుల నలసెనేమో
రీతిగాదు హరి నెచ్చరికె సేయరే


చ. 1:

పైపై బొద్దువొడచి పంకజములు విరిసె
గోవింద మేలుకొన మనరే
దీపములు దెల్లఁబారె తిమిరమింతయు జారె
శ్రీపురుషోత్తమునిఁ జేయంటి లెమ్మనరే


చ. 2:

కలువలు ముకుళించీ కలవింక లెలుగించీ
నెలఁతలు దేవదేవు నిద్ర దెల్పరే
జలనిధి పొంగణగె చాయలచుక్కలు మాసె
వలరాచగురు నుప్పవడము గమ్మనరే


చ. 3:

జీవులు మేలుకొనిరి చెంగలించె దరువులు
భావించి యచ్యుతునిట్టె పలికించరే
కావిరింతయు విరిసే కడు సంధ్యకు బొడ్డాయ
శ్రీవేంకటేశుని విచ్చేయ మనరే