పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0322-08 శ్రీరాగం సం: 04-128 వైష్ణవ భక్తి


పల్లవి :

గోవింద నీవన్నిటిలోఁ గూడితేఁ జాలుఁగాని
యీవల సంసారమైన యిది ధ్రువపట్టమే


చ. 1:

తలఁపు లోపల నీవు దగ్గరితేనే చాలు
కలలోని కాపురముఁ గైవల్యమే
బెళకు నాలుకకు నీపేరు వచ్చితేఁజాలు
పలికిన వన్నియు పరమవేదములే


చ. 2:

తొడరి నీపూజ చేత దొరకితేనే చాలు
పడుచుల బొమ్మరిండ్లు బ్రహ్మలోకమే
కడలేని నీభక్తి గలిగితేనే చాలు
కడజన్మమయినా నిక్కపు విప్రకులమే


చ. 3:

కాయముపై నీముద్ర గానవచ్చితేనే చాలు
పాయపు రతిసుఖము పరతత్వమే
యేయెడ శ్రీవేంకటేశ యిటు నీకే శరణంటి
పోయిన నా పాపమెల్లాఁ బుణ్యకర్మమే