పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0322-04 పాడి సం: 04-127 మాయ


పల్లవి :

కామధేనువు దేవకల్పితము భువిలోన
నోముచును భోగించ యుక్తివలెఁ గాని


చ. 1:

తలఁచినట్లనౌ దైవము వ్రాసిన వ్రాఁత
పలికినట్లనౌ పలుమంత్ర జపములు
నిలిపినట్లనౌ నిర్మల చిత్తము కీలు
నెలవునఁ బనిగొన నేర్పువలెఁ గాని


చ. 2:

యిమ్మనినట్ల నిచ్చు నేచినకర్మఫలము
కమ్మన్నట్లనౌ ఘనతపముల శక్తి
తెమ్మనినయట్లఁ దెచ్చు ద్రిష్టము యక్షిణీవిద్య
చిమ్ములను దనకంత చింతవలెఁగాని


చ. 3:

వునిచినట్లనుండు నొక్కడే దేహగుణము
యెనలేని శ్రీవేంకటేశ్వరుమాయ లివి
పెనచిన యిహమేపో బీజము వుద్యోగులకు
తనివి నలమేల్మంగదయ వలెఁగాని