పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0322-03 లలిత సం: 04-126 శరణాగతి


పల్లవి :

కావఁగ నీకే పోదు కరుణానిధివిగాన
దేవ నీ బంట్లము మా తెరువేఁటి తెరువు


చ. 1:

బండుబండై వూరఁగల పనులెల్లాఁ జేసేము
యెండాతా నీడౌతా నెఱఁగము
కొండలరాయఁడ మమ్ముఁ గోరి పుట్టించఁగా నీవు
బెండువంటి వారము మా బిగు వేఁటిబిగువు


చ. 2:

దీనుఁడనై యాసలనే దిక్కులెల్లాఁ దిరిగేము
కాని దెందో మంచి దెందో కానము
శ్రీనాథ నీవు మాకు జీవమయి వుండఁగాను
మానువంటి వారము మా మనసేటి మనసు


చ. 3:

బొందితోడఁ బుట్టితిమి భోగించేమేమైనా
యెందుకాతా నేడకౌతా నెఱఁగము
యిందును శ్రీవేంకటేశ యిహముఁ బరము నీవే
చెంది నీ దాసులము మా చేత్ర యేఁటిచేఁత