పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0320-05 పాడి సం: 04-116 మనసా


పల్లవి :

సచరాచర మిదె సర్వేశ్వరుఁడే
పచరించి యీతని భావింపు మనసా


చ. 1:

కదలెటి దంతయు కమలారమణుని-
సదరపు సత్యపు చైతన్యమే
నిదిరించెటి యీనిశ్చేష్టజగమును
వుదుటున నాతఁడు వుండేసహజమే


చ. 2:

కలిగివుండినది కల దింతయు హరి-
నలుగడఁ బరిపూర్ణపుగుణమే
మలల్సి లేనిదియు మహిమల నాతని-
నిలుకడగలిగిన నిర్గుణమే


చ. 3:

జీవరాసులగు సృష్టియింతయును
శ్రీవేంకటపతి చిత్తంబే
కైవల్యమె లోకపు టిహముఁ బరము
భావించ నేర్చిన పరమవిదులకు