పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0320-06 సామంతం సం: 04-117 గురు వందన, నృసింహ


పల్లవి :

అందుల కిదె ప్రతియౌషధము
ఇందిరాపతికి నెక్కినచింత


చ. 1:

పంచబాణములబాసట మంటిన-
చంచలమౌ నిశ్చలమనసు
పంచబాణగురుపాదము దలఁచిన
కంచుఁజంచలము గక్కన మాను


చ. 2:

కనకపుటాసలగరళం బంటిన
ననిచిన విజ్ఞానము చెదరు
కనకగర్భు నటు గన్నతండ్రిపై
మనసిడితే నిర్మలమౌ గుణము


చ. 3:

మునుకొని మొదలను మొలచిన ససికిని
పనివడి కొననే ఫలియించు
అనయము శ్రీవేంకటాధిపుకృపగల -
జనుని కిహపరము సఫలంబు