పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0320-04 బౌళి సం: 04-115 గురు వందన, నృసింహ


పల్లవి :

కనియెడి దిదియే వినియెడి దిదియే కడలఁ జదివెడిదిదియపో
నినుపు నీరై సర్వజగముల నిలిచె శ్రీహరిమాయ


చ. 1:

తలఁపు నొక్కటే తాను నొక్కఁడే దైవ మొక్కఁడే పో
కలిసి పెక్కుముఖంబులై లోకంబు దోఁచెనేని
తెలియఁ జిల్లుల కడవ లోపలి దీపమువలెనే
అలరి వెలిఁగెడి చూడఁజూడఁగ హరిప్రపంచపు మాయ


చ. 2:

దేహ మొక్కటే జీవుఁ డొక్కఁడే దినము నొక్కటేపో
మోహ జాగ్రత్స్వప్ననిద్రలు మొనపె భేదములై
వూహఁ బెక్కులయద్దముల చంద్రోదయమువలెను
సాహసంబున భ్రమలఁబెట్టెడి చదల నిదె హరిమాయ


చ. 3:

గురువు నొక్కఁడే మంత్ర మొక్కటే కొలువు నొక్కటేపో
అరయ భక్తియ వేరు వేరై యలరుచున్న దిదే
గరిమ శ్రీవేంకటగిరీశ్వరు కల్పితమువలెనే
వెరసి వారికి వారికే ఇది వింతవో హరిమాయ