పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0319-01 సామంతం సం: 04-106 శరణాగతి


పల్లవి :

పరమాత్మ నాజాడ భావించ నిట్టిది, నీవు
నిరుహేతుకాన నాకు నీవు బుద్దియ్యఁగదె


చ. 1:

అపరాధములు పెక్కు లటు నాయందున్నఁగాని
వుపమఁ బుణ్యముత్రోవ లూహించలేను
విపరీత పాపములు వేవేలు సేసినఁగాని
చపలగర్వము మాని శరణనలేను


చ. 2:

పలులంపటాలఁ బడి బడలినఁగాని, నాకు
పలవి నిన్నుఁ దలఁచేభక్తి లేదు
పులుసు నంజినఁగాని భూమిలో మిక్కిలి తీపు
తలపోయ నోటీకి నితవు గానరాదు


చ. 3:

వేవేలు నేరాలు సేసి వెరపు పుట్టినఁగాని
శ్రీవేంకటేశ నిన్నుఁ జేరదు మతి
వావిరి లోకపుమాయవలలఁ జిక్కినఁగాని
వేవేగ వెడలి ముక్తి వెదకఁడు జీవుడు