పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0318-04 దేవగాంధారి సం: 04-105


పల్లవి :

హరి నే నిన్నిందులకుఁగా దర్చించి కోరెడిది
గరిమల నాయంతరంగమున నినుఁ గానఁగ నడిగెదను


చ. 1:

మునుపే యీజగమెల్లా నీవు మెలవఁగ బెట్టినది
వెనుకొని నేను నీవాఁడనే యని విన్నవించనేల
నినుపై యీజీవరాసులన్నియు నీరక్షణలోనివి
కనుఁగొని నన్నును రక్షించుమని మరి కమ్మరఁజెప్పఁగనేల


చ. 2:

యిహమునఁగర్మాధీనంబయి సిరులియ్యఁగ నినునింకా
మహిలో నివి యవి నాకు నిమ్మనుచు మరి యడుఁగనేల
సహజపుఁ దల్లియుఁదండ్రియు బంధులు సంతతి నీవై యుండఁగను
విహితముగా నిను నక్కడ నిక్కడ వెదకఁగ మరి యేల


చ. 3:

శ్రీవేంకటపతి వరము లొసంగుచు చేరువ నీవై యుండఁగను
ఆవల నీవల నితరదేవతల యాసలఁ బడనేల
దైవశిఖామణి వాదిమూరితివి తగిన స్వతంత్రుఁడవు
యేవిధులు నేనెఱఁగను నీవే యింతాఁ జుమ్మీదాఁచఁగనేల