పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0318-03 సామంతం సం 04-104 శరణాగతి


పల్లవి :

అచ్చుతుడనియెడి నామముగలిగినయట్టి నీవేకాక
కుచ్చి నీకు నేశరణని కొలిచితి గురుతుగఁ గావఁగదే


చ. 1:

అణురూపగుమశకములోపల నణఁగిన నీకంటే
గుణించి యెంచి చూచినను కొంచె మింకనేది
ప్రణుతింపంగ బ్రహ్మండకోట్లు భరియించునీకంటే
గణనకు నెక్కుడు నీవేకాక ఘన మిఁకనేది


చ. 2:

దాకొని జగములు పుట్టించు బ్రహ్మకు తండ్రివి నీవే
కైకొని చదువులఁ దెలిసిచూడ రక్షకులిఁక మరి వేరి
యేకోదకముగ వటపత్రమున యీఁదేటినీకంటే
దీకొనిపలికిన కాలంబుల కొనదేవుఁడు మరివేఁడీ


చ. 3:

శ్రీవేంకటమున వరములొసఁగేటి శ్రీపతి నీకంటే
తావుఁన గన్నులఁ జూడఁగ బ్రత్యక్షదైవము మరివేఁడి
వేవేలకు వైకుంఠవిభుఁడవై వెలిసిన నీకంటే
భావించి చూచిన నంతరంగమునఁ బరోక్షదైవముమరివేఁడీ