పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0319-2 గుజ్జరి సం: 04-107 శరణాగతి


పల్లవి :

శ్రీపతి నీ సేవ చిత్తము గోరదు
పాపముల వెంటనే పారీ నయ్యా


చ. 1:

తెగనికర్మము దేహములు గోరు
వగలయీపీఁగ వ్రణాలు గోరు
నగుచుఁ దొల్లింటి నా పూర్వకర్మములు
పొగరుభోగములే పొందించె నయ్యా


చ. 2:

సాకిరివయసు సంసారము గోరు
చీకురువాయులు జీడిమాను గోరు
దీకొని నాతోడి తీరనింద్రియములు
కైకొని మర్మములు గలఁచీ నయ్యా


చ. 3:

వేదవిజ్ఞానము విరతియే కోరు
నీదాసుఁడైతేనే నీశరణు గోరు
యీదెస శ్రీవేంకటేశ నీవు నాలో
పాదైయుండి నన్ను బ్రదికించే నయ్యా