పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0267-2 శంకరాభరణం సం: 09-098

పల్లవి:

నాకు నాకే వెరగయ్యీ నన్నుఁ జూచి
పైకొని మరుఁడు సేసే భ్రమత గాఁబోలును

చ. 1:

పులకించితి నింతె పూవుల మొగ్గలు రాలీ
కలికి వసంతము గాఁబోలు
పలికితి నింతె నేను ఫైకొనీ కెంజాయకెంపు
కలయగ నెరసంజ గాబోలును

చ. 2:

విందుల నవ్వితి నింతె వెన్నెలపొలపుగాని
కందువ చంద్రోదయము గాఁబోలును
ముందరఁ జూచితి నింతె ముంపు దామెరలు రాలీ
దిందుపడి యింతలోనె తెల్లవారఁబోలును

చ. 3:

చెమరించితి నింతె నేసముత్యములు రాలీ
తమి శ్రీవెంకటపతి దగ్గరఁ బోలు
అమరఁ గూడితి నింతె ఆతఁడు మేను మరచె
సమమోహములలోని సందడి గాఁబోలును