పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0267-1 సామంతం సం: 09-097

పల్లవి:

తొల్లిసేసినంతె చాలు తోడఁ జేతనం బెట్లు
చిల్లరచేఁతలు యిఁక జేయఁగ వద్దనవే

చ. 1:

గొల్లెత లుసురు పిల్లఁగోవిమోతలై యంటె
వొల్లనె నన్నిఁక నేఁప నొద్దనవే
మెల్లనె వారితొ బొంకిమే నెల్ల నల్ల నాయ
కల్లలు నాతో నాడఁ గమ్మటి వద్దనవే

చ. 2:

నెలఁతల కనుదిష్టి నెమలిచుంగులై యంటె
వలఁబెట్టి చలపట్ట వద్దనవే
అల మదరాగము పీతాంబరమై మొల నంటె
యెలయించి ననుఁ బాయ నింకా వద్దనవే

చ. 3:

చేరినవారి పొందులు శ్రీసతియై వుర మంటె
వోరసేయ నాతో నొద్దనవే
యీరీతి శ్రీవెంకటేశుఁ డిట్టె తా నన్నుఁ గూడి
గారవించె నిఁక నెందూఁ గదల వద్దనవే