పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0266-6 పాడి సం: 09-096

పల్లవి:

అక్కలాల అమ్మలాల అందరు నున్నా రిదె
చెక్కుచేత నుంటిఁ గాక సిగ్గువడి వుంటినా

చ. 1:

వుండి వుండి నాలోన నుసురంటి నింతె పో
అండ నేఁ దను వెంగెము లాడితినా
దండియై కన్నీళ తోనే తప్పక చూచితిఁ బో
నిండుఁ గొలువునఁ దన్ను నేరము లెంచితినా

చ. 2:

నా తమకములు చూచి నవ్వుకొంటి నింతె పో
చేతికి లో నని తన్నుఁ జెనకితినా
మోతలఁ గాఁకలతోనే మోము వంచితి నింతెపో
పై తరవువెట్టి తన్ను బలిమి సేసితినా

చ. 3:

కడలేని మోహమునఁ గాఁగిలించితి నింతెపో
వుడివోని వెరగుతో నూరకుంటినా
యెడలేక శ్రీవెంకటేశుఁడు న న్నేలఁగాను
కడు నే మెచ్చితిఁ బో కాదంటినా