పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0266-3 భైరవి సం: 09-093

పల్లవి:

విన్నపాల కెవ్వరికి వేళ గాదు
వున్నతి నంతరంగాన నున్నాఁడు దేవుఁడూ

చ. 1:

సరుస చెమటలు మేన జారఁ గాను
నిరతపు నిట్టూరుపు నిగుడఁగాను
సరిఁ గరఁగి జవ్వాది జారఁగాను
వొరసి మలఁగుమీఁద నున్నాఁడు దేవుఁడూ

చ. 2:

తెల్లని కన్నుల నిద్ర దేరఁగాను
చిల్లరై గంథపుబేఁట్లు చిట్లఁగాను
వొల్లనె కొప్పున విరు లొలుకఁగాను
వుల్లసాన నరవిరై వున్నాఁడు దేవుఁడూ

చ. 3:

అలమేలుమంగ మేలమాడఁగాను
కలయఁ దమకములు గదుమఁగాను
అలరి శ్రీవెంకటేశుఁ డల్ల వాఁడె
వొలిసి యేకతమున నున్నాఁడు దేవుఁడూ