పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0266-1 లలిత సం: 09-091

పల్లవి:

మనలోని మాఁటా మనసులో తీఁట
వెనకఁ జెప్పేఁ గాని విడువు మీ పూఁటా

చ. 1:

మొగములో బిగువు మోవిమీఁది తగవు
జిగి దేరె నిందరిలోఁ జెప్పనేలా
చిగురుఁగొప్పు చెదరు చిమ్ముఁ జూపుల బెదరు
నగితేనె పచ్చి దేరి నన్ను నేమీ ననకు

చ. 2:

ముక్కున వుసురులు చెక్కుల యసరులు
కుక్కి తోయ కంత కొంత గుట్టె మేలు
అక్కుపై గురుతులు అంగపు సరతులు
మక్కళించనేల యిది మరువకు చాలు

చ. 3:

కాఁగిటి మైతావులు కన్నుఁగవకావులు
యీగతి నా భావము నా యెదుట నేల
భోగపు శ్రీ వెంకటేశ పొందితివి నన్ను నిట్టె
రాఁగిన సరసములు రచ్చలలోఁ దగునా