పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0265-6 పాడి సం: 09-090

పల్లవి:

ఎట్టు సింగారింత మమ్మ యీ యింతిని
ముట్టని సింగారము ముందు ముందె యమరే

చ. 1:

పొలితి చంద్రవంకబొట్టు వెట్టఁ బోయి సంది
మలసే గోరొత్తు చూచి మాని నవ్వెను
కలిమిఁ జంద్రగావి గట్టఁబోయి అద్దములో
సొలపుఁ గన్నుల కావి చూచి నవ్వెను

చ. 2:

అమరిన ముత్యాలహారములు వెట్టఁ బోయి
చెమటముత్యాలు చూచి చెలి నవ్వెను
కొమరె యరవిరులు కొప్పున ముడువఁ బోయి
తమిఁ బులక విరులు తాఁ జూచి కొంకెను

చ. 3:

వీఁగుచుఁ బరిమళము వెలఁది వూయఁగఁ బోయి
కాఁగిటి వాసన చూచి కడు నవ్వెను
సోగల శ్రీవెంకటేశు సురతసింగారము
వాగమై యమరెఁ గాన వన్నెలెల్ల నమరే