పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0265-5 నాదరామక్రియ సం: 09-089

పల్లవి:

చెలువుఁడ నీవు మేలు చిత్తమె తీలుగాని
పలుకులఁ దనిసితి బాస లెట్టో కాని

చ. 1:

అంది నీ మాటలు మోవి యమృతపుఁ దీపె పో
చిందర నీ చేఁతలె చేఁదు గాని
విందుల నీ ప్రియములు వెన్నకంటె నున్ననె పో
కందువ నీ గుండె యిదె కడురాయి గాని

చ. 2:

సొంపుల నీ యిచ్చకాలు చుక్కలకంటె గనము
గుంపెన నీ గుణమె కొంచము గాని
తంపి నీ చుట్టరికము తామెరకంటె దంపర
యింపు నీ వలపె యార డిన్నిటిలోఁ గాని

చ. 3:

గరిమె నీ నగవులు కప్పురాలకంటెఁ జవి
కరఁగు నీ విడెమె కారము గాని
యిరవై శ్రీ వెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
సరవు లిప్పుడు మేలు సటదొల్లెకాని