పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0265-3 కొండమలహరి సం: 09-087

పల్లవి:

ఏమో సేయఁగఁ బోగా నేమో ఆయ
యేమని చెప్పుదుఁ బను లిటువంటివే

చ. 1:

వుక్కుమీరి కృష్ణుఁడు మావుట్లు దించఁబోఁగాఁ
బక్కన నేఁ బారి తెంచి పట్టుకొంటినే
మొక్కలాన నతఁడు నా మోము చూచె నంతలోనె
మక్కువ నా మే నెల్ల మర పాయనే

చ. 2:

కమ్మర నంతటఁబోక కాఁగులపాలంటఁ బోఁగా
బిమ్మిటిగాఁ గిందుమీఁదై పెనఁగితినే
యెమ్మెల నాతఁడు నా యిక్కువకుఁ జేయి చాఁచె
కమ్మి నా చిత్తము నీరై కరఁగితినే

చ. 3:

వుద్దండాన గట్టి వెన్నముద్ద లారగించఁగానె
గద్దించి కాఁగిట నేఁ గమ్ముకొంటినే
వొద్దనె శ్రీ వెంకటేశుఁ డొంటి నన్నుఁ గూడఁగా
నిద్దరికిఁ బులకించి యేక మైతిమే