పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0265-1 వరాళి సం: 09-085

పల్లవి:

కంటిమి వొకటిసేయఁగా నొకటి నీయందె
వొంట దొకటొకటికి నొద్దు మాతో బొంకులు

చ. 1:

మాటలాడఁబోతే మచ్చము మోవిఁ దోఁచె
నాటఁజూడఁబోతేను నవ్వు దోఁచెను
నీటున నుండఁగఁ బోతే నిద్దుర గన్నులఁ దేరె
యేటి కింకఁ జాలు చాలు నేల మాతో బొంకులు

చ. 2:

దగ్గరిరాఁబోతే వింతతావులు బుగులుకొనె
వొగ్గి విడె మియ్యఁబోతే నొలికె సిగ్గు
బెగ్గిలి వేఁడుకోఁబోతే పెంజెమట మేనఁ జిందె
యెగ్గు లెంచ నిఁక నిన్ను బొంకే వయ్యా

చ. 3:

కాఁగిట నన్నంటఁబోతే గందపు బేఁటులు రాలె
మాఁగిన రతులనుఁ దమకము రేఁగె
వేఁగుదాఁకా మాటల శ్రీవెంకటేశ కూడితివి
నీ గతులు చూడఁ జూడ నిజమె పో బొంకులు