పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0264-5 శంకరాభరణం సం: 09-083

పల్లవి:

అది గురుతు మరవ ననవె నేను
అదన నిన్నిట జాణఁ డనవె తాను

చ. 1:

దోమటి నెందొ తన్నుఁ దోఁగి చూచితే నేను
నా మోము చూచి యట్టె నవ్వెఁగా తాను
కామించి యాడో సింగారములు నించుకోఁగా
వేమారు మొక్కితే దీవించెఁగా తాను

చ. 2:

దంతపుటోవరిలోన తా నేపని నుండఁగానో
కొంత నేఁ బిలిచితే నూఁకొనెఁగా తాను
దొంతులఁ దమ్ములముపొత్తులఁ జేయఁగాఁ గంటె
చెంత నన్నుఁ దప్పక చూచెఁగా తాను

చ. 3:

యీడకె శ్రీవెంకటేశుఁ డిప్పు డిట్టె విచ్చేసి
వాడికె సిగ్గులఁ దల వంచెఁగా తాను
కూడి చొక్కేవేళ మోము గురిగాఁ జూచితే నేను
మేడెపుఁ గాఁగిట నొక్కి మెరసెఁగా తాను