పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0264-3 రామక్రియ సం: 09-081

పల్లవి:

ఔనె మాటకు మాట ఆడితివి వోరి
కాని యింకా నేమి గలిగినాఁ జెప్పరా

చ. 1:

కోరి నీ మోవి మెత్తన కుచముల కఠినాలు
చేరి నీతో పొందెట్టు సేయవచ్చునే
వోరి నీగుణము రాయి వొట్టిమాట చిగు రని
ఆరీతి నిందరికిఁ జూప ననువుగావలసిరా

చ. 2:

కుత్తికె మరుశంఖము కురులు వంకగాలాలు
కొత్తనీకు నాకుఁ బొందు గూడు నటవే
వొత్తి నీ చదువు వేదా లొడ్డినవి గాలాలు
జొత్తుగా నింతటఁ జెప్పి చూపఁగ వలసిరా

చ. 3:

కడు నీ నవ్వు చల్లన కనుచూపు చురుకులు
కొడిమె నీవు నన్నెట్టు గూడితివే
వడి శ్రీవెంకటేశుఁడ వలపులరతి నీకు
నుడిసి చలి వేఁడని చూపె నింతేరా