పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0264-1 రామక్రియ సం: 09-079

పల్లవి:

ఆకెవో నాప్రాణ మోహనపురాణి
దాకొని వేవేలు కాంతలలోన నున్నది

చ. 1;

ముదితకురుల నెల్లా ముత్యములు మాణికాలు
గుదిగుచ్చి కీలుగంటు గొన్నది
సదరపు పసిఁడివజ్రాల చనుకట్టుది
అదె పైడిపూవులపయ్యెద వల్లెవాటుది

చ. 2:

పచ్చలు దాచినయట్టి పాదుకలు మెట్టినది
లచ్చన మొగవుల మొలనూళ్లది
అచ్చపుటుంగరముల అందెలుఁ బాయవట్టాలు
గచ్చుల ముంజేతుల కంకణసూడిగేలది

చ. 3:

నానాభూషణముల నానాసింగారాల
పానిపట్టి నా దిక్కె తప్పక చూచేది
ఆనకపు శ్రీ వెంకటాద్రిపతినైన నన్ను
తానె వచ్చి కూడి నాదగ్గరనె వున్నది