పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0263-6 శంకరాభరణం సం: 09-078

పల్లవి:

తా నెట్ల నున్నాఁడో తరుణి వినిపించవే
కానక నినుఁ గన్న నతనిఁ గన్నట్ల నాయనే

చ. 1:

కొంతవడిఁ దనుపేరు కోరి నాలుకఁ దలఁతునే
కొంతవడి దనసుద్దులు కొమ్మలచే బిందునే
కొంతవడి తానున్న కొలువుచిత్తరువు చూతు
కాంతయీరీతిఁ బొద్దు గడపుదునే నేను

చ. 2:

మది నొక్క వేళఁ దనమాట దలపోతునే
కదిసి యొకవేళ దన్నుఁ గలలోనఁ గందునే
పదములనె వొకవేళ యెదురు నడతు నేఁ దనకు
తుద నిట్ల దినదినము దొబ్బుదునే నేనూ

చ. 3:

సగినములు చూచుచు నే జరపుదునే వొకగడియ
వగలఁ దను దూరి లేకలు వ్రాతుఁ గొంతదడవు
జిగి నింతలోఁ గూడె శ్రీవెంకటేశ్వరుఁడు
మగిడి యల్లాడ నపుడు మలఁగుపయి నిపుడూ