పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0263-3 గౌళ సం: 09-075

పల్లవి:

నీటినడు మడచితే నేఁడు రెండౌనా
యేఁటి కింక గొంకేవు యింతిఁ జేకోవయ్యా

చ. 1:

వాసులఁ జందురులోనె వడిఁగందు గద్దు గాక
కాసే వెన్నెలలోనఁ గందు గలదా
ఆసల మోమునఁ గోప మటు నీపైఁ జల్లెఁ గాక
యీ సతికి మతిఁ గోప మింతయిన నున్నదా

చ. 2:

కొలనిలో కలువలకొట్ట గొన వాఁడి గాక
అలరుఁ బరిమళము లవియూ వాఁడె
సొలసి చూచిన యింతి చూపులె వాఁడి గాక
నలువంకఁ గన్నులలో నవ్వులూ వాఁడా

చ. 3:

అంది నారికళపుఁ గాయకుఁ బైనె గట్టి గాక
కందువ లోనూ నట్టె గట్టి యయ్యీనా
పొందిన శ్రీ వెంకటేశ పొలిఁతి పై గుట్టు గాక
గొందినె కూడిన యింతిగుణము కఠినమా