పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0263-2 ముఖారి సం: 09-074

పల్లవి:

మానిని భావము చూచి మాకు వెరగాయ నిదె
పూని చూ పోపక నీ పైఁ బూవు లెత్తి చల్లెను

చ. 1:

విండు నీ మై సొమ్ముల నిగ్గు మాణికములలో
అండఁ దననీడ చెలి యన్నిటాఁ జూచి
కొండుక పదారువేలు గోపాంగనలు నీమై
నుండ వా రని తలఁచి వొగిఁ దల వంచెను

చ. 2:

వన్నెల నీ పచ్చడాన వ్రాసిన కోలాటపు
అన్నువపతిమలను అటు చూచి
మున్ను పురకామినుల మోహము మఱవ లేక
పన్నుక వున్నాడ వని పకపక నవ్వెను

చ. 3:

కూడిన నీ రతిఁ దానె కోరి పెక్కుబంధముల
వేడుకఁ బెనఁగి శ్రీ వెంకటేశుఁడ
పాడి నిన్ని నేరుపులు పచరించితిఁ దా నని
చేడె వూరకె భ్రమసి సిగ్గు వడీ నదివో