పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0262-5 సామంతం సం: 09-071

పల్లవి:

ఇచ్చక మాడ నెఱఁగ నేమి సేతునే
హెచ్చీఁ బెంజెమటలు యేమి సేతునే

చ. 1:

చక్కని పతిగుణాలు సారె నాతోఁ జెప్పఁగాను
యెక్కడో వినీ వీను లేమి సేతునే
పెక్కువ నాతఁడు నన్నుఁ బిలువ నంపె ననఁగా
యిక్కడ నా మోము నవ్వీ నిఁక నేమి సేతునే

చ. 2:

యిదె మేడపై నతఁడు యిటు నన్నుఁ జూచెనంటే
హృదయము చిల్లులయ్యీ నేమిసేతునే
వదల కాతఁడు నా వాకిటికి వచ్చె నంటే
యెదుటఁ గన్నీ ళ్లూరీ నిఁక నేమి సేతునే

చ. 3:

బలిమి నాతఁడు నాపైఁ జేయి వేయఁగాను
యెలమి నిట్టూర్పు రేఁగె నేమి సేతునే
కలసి శ్రీ వెంకటాద్రిఘనుఁడు నన్నుఁ గూడఁగ
యెలఁదీగెమనేను వొంగె నేమి సేతునే