పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0261-6 రామక్రియ సం: 09-066

పల్లవి:

గుట్టుతో లోలో గొణఁగుట గాక
దట్టించి చెలులాల తను ననే దేమె

చ. 1:

ఆకసపుఁ జంద్రునికి నాసపడఁగా నేమి
వాకైరాని పతికి వలవఁగా నేమి
ఆకడ నందనిపంటి కఱ్ఱుచాఁచఁగా నేమి
జోకకురాని పతినిఁ జూడఁగా నేమి

చ. 2:

కొనబువెఱ్ఱి చెరకు కొనయేమి మొదలేమి
యెనయని పతిమాట లెన్నైనా నేమి
పొనిగి యంపలిచెట్టు పూచె నేమి కాచె నేమి
ననుచని పతి యంత నవ్వినా నేమి

చ. 3:

వసంతకాలము దప్పి వంబు గావఁగా నేమి
కసిగాటై యెలయించి కలయఁగా నేమి
యొసఁగి శ్రీ వెంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
వసమైన మీఁద నింక వాసు లెంచ నేమి