పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0261-5 ఆహిరి సం: 09-065

పల్లవి:

కదిసిన మిము మెచ్చఁ గలము గాకా
యెదిటి మీ యలుకలు యివి చూడఁ గలమా

చ. 1:

కన్నుఁ గొనలె వేరు కమ్ముఁ జూపు లొకటె
మిన్నక వుండె మీలో మీ రొకటె
చిన్నఁబోయి నీ వాడ చెక్కుచేతఁ జెలియీడ
వున్నభావ మిది చూచి వోరుచఁగఁ గలమా

చ. 2:

వీను లివియె వేరు వినుకలి యొకటె
ఆనకపు మీ మోహాలవి యొకటె
పానుపై నాకె వెలుపల మలగుపై నీవు
పూని వున్నమీకు నేము బుద్ది చెప్పఁగలమా

చ. 3:

కడఁగి చేతులె వేరు కాఁగిలిది యొకటె
యెడసి కూడిన మీరిద్ద రొకటె
అడరిన శ్రీ వెంకటాధిప మీ యిద్దరిలో
జడియుఁ బంతములకు సాక్షి చెప్పఁ గలమా