పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0261-4 రామక్రియ సం: 09-064

పల్లవి:

నీకు నీకె తెలుసుకో నీ సుద్దులు
నాకుఁ బొద్దుసేసి నవ్వు నవ్వఁ దగునా

చ. 1:

కూడనన్న మానదు నాగుణ మేమొకాని
ఆడ నీ చేఁతకు నిన్ను నంటఁ దగునా
చూడ నన్న మానవు నా చూపు లేమొ కాని
వాడికె నీ మోముదిక్కై వద్ద నుండఁ దగునా

చ. 2:

విన నన్న మానవు నా వీనులేమొ కాని
కొనబు నీ మాఁట లూ కొనఁ దగునా
నినుఁ బేరుకొన నన్న నిలువదు నా నోరు
పెనఁగి ని న్నీడకుఁ బిలువఁగఁ దగునా

చ. 3:

సోఁక నన్న మానదు నా సోగ మే నేమొ కాని
పైకొని నీ పచ్చి మీఁదఁ బచ్చి దగునా
యీకడ శ్రీ వెంకటేశ యిటు నన్నుఁ గూడితివి
కాకుగా నిన్నియుఁ దారు కాణించఁ దగునా