పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0250-6 కాంబోది సం: 09-060

పల్లవి:

చేతనైనపాటి సేవ సేయుదుఁ గాక
ఆత లీతలి పనులు అవి నావశమా

చ. 1:

గచ్చుల నీ మన సిట్టె కరఁగించఁ గలఁ గాక
నచ్చు నీ చెమట మాన్ప నావశమా
పచ్చిగా నీమోవిమీఁదఁ బల్లు మోపఁగలఁ గాక
లచ్చన గుఱుతు మాన్ప లాగుల నావశమా

చ. 2:

చేరి నీసిగ్గులు దేరఁ జెయి వేయఁగలఁ గాక
నారుఁ బులకలు మాన్ప నావశమా
సారె నీ మోము నేను చక్కఁ జూడఁగలఁ గాక
యేరా నీనవ్వులు మాన్పనివి నావశమా

చ. 3:

అంటి నిన్నుఁ గాఁగిటిలో నలయించఁగలఁ గాక
నంటు నీ నిట్టూర్పు మాన్పనావశమా
జంటవై శ్రీ వెంకటేశ సరుసఁ గూడితి విట్టి
వెంట రాకు మని మాన్ప విభుఁడ నావశమా