పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0251-5 శ్రీరాగం సం: 09-005

పల్లవి:

ఎవ్వరి నే మన లేవు యింతేసికి నోపము
పువ్వునఁ బుట్టినయట్టి పూఁపవంటివాఁడవు

చ. 1:

మిక్కిలి నీతో నేను మేరలు మీరిన నైతే
యెక్కడ నెవ్వతె వచ్చి యేమనునో
దక్కితి సారెసారెకు దడవకువయ్య మమ్ము
చిక్కి నీ వందరిపెట్టు జెట్టువంటివాఁడవు

చ. 2:

చెనకి నీ బుజముపై చెయి నేను వేసితేను
వనిత యెవ్వతె వచ్చి వంతు వట్టునో
పెనఁగి నీ వాడా నీడాఁ బిలువకువయ్య నన్ను
తనిసి సూదిపిరిఁది తాడువంటివాఁడవు

చ. 3:

గుట్టున నిన్నుఁ గూడితి గోర నిన్ను నూఁదితేను
దిట్టయై యెవ్వతె వచ్చి తేరి చూచునో
పట్టి శ్రీ వెంకటేశ్వర భ్రమలఁ బెట్టకువయ్య
బట్టబయటిపెసరుఁబంటవంటివాఁడవు